Wednesday 2 November 2022

 విశాఖ మ్యూజిక్ అకాడమీ - 9 అక్టోబరు 2022 - నేదునూరి జయంతి


స్థానిక 'విశాఖ మ్యూజిక్ అకాడమి - విశాఖపట్నం' వారు సంగీతకళానిథి నేదునూరి కృష్ణమూర్తి అవార్డు ను ప్రముఖ గాత్రవిదుషి శ్రీమతి జి. శారదా సుబ్రమణ్యం గారికి తిథిననుసరించి శ్రీ నేదునూరి జయంతినాడు (9.10.22 ఆదివారం) బహూకరించి ఘనంగా సభ నిర్వహించారు.


నాటి అవార్డు ప్రదానోత్సవసభ సహకార్యదర్శి శ్రీ అయ్యగారి భుజంగరావు గారి ఆహ్వానంతో ప్రారంభమైంది. శ్రీ గురువిల్లి అప్పన్న గారి మంగళవాద్య నేపథ్యంలో కుమారి ఘట్టి శ్రీవిద్య ప్రార్థనతో సభ శుభారంభానికి నోచుకుంది. జ్యోతిప్రకాశనంలో స్వర్గీయ నేదునూరి కుమార్తె శ్రీమతి వై. విజయశ్రీ, ముఖ్యఅతిథి డా. ప్రయాగ మురళీమోహనకృష్ణ, నాటి సభాధ్యక్షులు శ్రీ బి.యె.రాజారావు, (కార్యనిర్వహణ ఉపాధ్యక్షులు), డా. పేరాల బాలమురళీకృష్ణ (సాంస్కృతిక ఉపాధ్యక్షులు), కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, ఛీఫ్ పాట్రన్ డా. యస్. విజయకుమార్, నేదునూరి అవార్డు అందుకుంటూన్న శ్రీమతి శారదా సుబ్రమణ్యం గారలు పాలుపంచుకున్నారు.


నాటి సభాధ్యక్షులు శ్రీ బి.యె.రాజారావుగారి స్వాగతోపన్యాసం, డా. పేరాల అవార్డు నేపథ్య వివరణ, అనంతరం డా. యస్. విజయకుమార్ సందేశం, చోటుచేసుకున్నాయి. ముఖ్యఅతిథి డా. ప్రయాగ మురళీమోహన కృష్ణ తమసందేశంలో నేదునూరితో తన అనుబంధాన్ని పూర్వకృత పుణ్యంగా పేర్కొన్నారు. తరువాయి శ్రీమతి జి. శారదాసుబ్రమణ్యం గారికి నేదునూరి అవార్డు ప్రదానోత్సవం జరిగింది. శ్రీమతి లలితా చంద్రశేఖర్, శ్రీమతి యమ్ కె సునీత (అకాడమీ మహిళా సభ్యులు), చందన కుంకుమలతో సత్కారానంతరం నాటి అధ్యక్షులచే పుష్పహారం, శాలువ, ఛీఫ్ పాట్రన్ చందనమాల, ముఖ్య అతిథి జ్ఞాపిక, డా. పేరాల నగదు బహుమతిని అందజేశారు. కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్ గారు (డా. పేరాల రచించి చదివిన) ప్రఖ్యాపన పత్రాన్ని, అందజేశారు.

శ్రీమతి జి. శారదా సుబ్రమణ్యం తమ స్పందనలో తన తల్లిదండ్రులకు, గురువులకు వందనమర్పిస్తూ, నేదునూరివారి పితృ వాత్సల్యాన్ని తలచుకొని ఈ అవార్డు బాధ్యతను మరింత పెంచిదన్నారు.


అనంతరం జరిగిన సంగీత సభలో శ్రీమతిజి. శారదా సుబ్రమణ్యం తన గాత్రమాధుర్యంతో సంగీత రసజ్ఞులను భక్తిపరవశులను గావించారు. శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ (వయోలిన్), శ్రీ కర్రా శ్రీనివాస శర్మ(మృదంగం) శ్రీ యమ్. సూర్యప్రసాదరావు (ఘటం) గార్ల సహకార వాద్యాలతో సభ నిండుగా జరిగింది.


శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ (ముంబయి)గారు నేదునూరిగారిపై వ్రాసిన పద్యంతో గాత్రసభ ఆరంభమైంది. నేదునూరి నిత్యమూ మొట్టమొదట పాడుకునే "గజాననయుతం గణేశ్వరం (చక్రవాకం), నెనరుంచరా (సింహవాహిని), పార్వతీకుమారం (నాటకురంజి), నరసింహ (బిలహరి), రామరామ రామకృష్ణ (కల్యాణి), భోగీంద్రసాయినం (కుంతలవరాళి), హరిహరిరామ (కానడ), పాహిపాహిమాం(కాపీ), నీ మాటలేమాయెనురా (పూర్వీకల్యాణి), రాగేశ్వరి తిల్లానా లు చొటు చేసుకున్న సభలో, భైరవి అంశం ,'యికనన్ను బ్రోవకున్న' (నైకారపట్టి శేషయ్య రచన) ప్రధానంగా సాగింది. "భవసాగరమున మునిగి వేసారితినయ్య" దగ్గర నెరవల్ భావస్ఫోరకంగా ఉండడంతో సంగీత రసజ్ఞుల కరతాళ ధ్వనులకు నోచుకుంది. శ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మ వైలన్, శ్రీ కర్రా శ్రీనివాస్ మృదంగం, శ్రీ యమ్. సూర్యప్రసాదరావు ఘటం సహకారాలు కచేరీకి మరింత శోభను చేకూర్చాయి. డా.పేరాల సమీక్ష వందనసమర్పణల తో సభ సుసంపన్నమైంది.


డా. పేరాల బాలమురళీ కృష్ణ 

(గానకళ విలేఖరి)

No comments:

Post a Comment

 విశాఖ మ్యూజిక్ అకాడమి విశాఖపట్నం 54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలు విశాఖ మ్యూజిక్ అకాడమి స్థానిక కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 25.11.2023 నుండి ...