Sunday 24 July 2022

పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 92వ జన్మదినం సందర్భంగా సంగీతపోటీలు - సంగీతసభ


స్థానిక "విశాఖ మ్యూజిక్ అకాడమీ" వారి అధ్వర్యవంలో పద్మవిభూషణ్ సంగీతకళానిథి డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మహనీయుని 92వ జన్మదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి (9th జూలై 2022, కళాభారతి AC ఆడిటోరియం). ఈ సందర్భంగా ఆ వాగ్గేయకారుని రచనలను  మూడు అంశాలుగా వర్గీకరించి 2022 జూన్ 18-19 తేదీలలో గాత్రపోటీలను నిర్వహించి, ఆ పోటీలలో ప్రథమ బహుమతులను గెలుచుకున్న వారిచేత ముందుగా నిర్ణీత సమయం ప్రకారం గాత్ర సంగీత కచ్చేరీల నిర్వహణతో సభ ప్రారంభమైంది. 

"వర్ణం-కీర్తన" అంశాలలో ప్రథమబహుమతి గెలుచుకున్న కుమారి కోట గాయత్రి వరేణ్య, కుమారి అయ్యన్ ప్రణతి లు ముందుగా తమ గానాన్ని వినిపించారు. కుమారి గాయత్రివరేణ్య "అభిమాన కుమారుడనమ్మ" (ఖమాస్ ), హనుమ (సరసాంగి), వర్ణం, కీర్తనలు ఆలపించగా, కుమారి అయ్యన్ ప్రణతి షణ్ముఖప్రియ వర్ణం, (పదనీరాజములె నమ్మితి), గురుని స్మరింపవే (హంసవినోదిని) కీర్తనలను ఆలపించారు.
వీరిరువురికి చెరి పది నిముషాలు కేటాయించారు.

డా. మంగళంపల్లి వారి మేళకర్తరాగ కీర్తన, తిల్లాన అంశాలలో మొదటి బహుమతి గెలుచుకున్న కుమారి ప్రీతిరాజు కారణాంతరాలవలన సభకు రాలేకపోవడంతో రెండవబహుమతి గెల్చుకున్న కుమారి కర్రా నాగవైష్ణవి తమగాత్రం వినిపించారు. లతాంగి రాగంలో "తామ్రలోచని" కీర్తన, బేహాగ్ రాగ తిల్లానా ఆమె ఎంచుకున్న అంశాలు. 

ఇక డా. మంగళంపల్లివారు రచించిన కీర్తనలలో మనోధర్మం, తిల్లాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న కుమారి సోమయాజుల విష్ణుప్రియ యిందిర తమ గాత్రం వినిపించారు. చింతయామి సతతం (సుచరిత), ఠాయ రాగమాలిక తిల్లానా, ఆమె ఎన్నుకున్న అంశాలు.

*మిగతా విజేతల వివరాలు*

1. వర్ణం, కీర్తన అంశాలలో  రెండవ బహుమతి- కుమారి శిష్ట్లా శ్రీప్రణతి, మూడవ బహుమతి - శ్రీ పి.వి.పృధ్వీరాజ్, కమెండేషన్ బహుమతి - కుమారి శిష్ట్లా సంస్కృతి, కుమారి మునగాల జోషిక  అందుకున్నారు.

2. మేళకర్తరాగాలలో కీర్తన, తిల్లాన అంశాలలో   మూడవ బహుమతిని కుమారి నామతీర్థాల లక్ష్మీప్రసన్న మరియు కుమారి కొత్తపల్లి శ్రీదేవి ప్రవల్లిక గెలుచుకున్నారు.

3. మనోధర్మం, తిల్లాన అంశాలలో రెండవ బహుమతికి కుమారి రుద్రావఝ్ఝల కృష్ణప్రియ, మూడవబహుమతికి కుమారి యివటూరి కృష్ణశ్రుతి, శ్రీ బంకుపల్లి విద్యాసాగర్ లు అర్హులయ్యారు. 

ఈ పోటీలకు శ్రీ మోడుమూడి సుధాకర్,  డా. మండపాక శారద, శ్రీమతి లలితాచంద్రశేఖర్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. సభాకార్యక్రమంలో అకాడమీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ముఖ్యఅతిథి ప్రిన్స్ రామవర్మ చేతులమీదుగా జ్ఞాపికలను అందించింది.

ఈ పోటీలలో ప్రథమ బహుమతులను అకాడమీ అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, ద్వితీయ బహుమతులు స్వర్గీయ పేరాల లక్ష్మణరావుగారి జ్ఞాపకార్థం డా. పేరాల బాలమురళీకృష్ణ, మూడవ బహుమతులు శ్రీ అయ్యగారి భుజంగరావు, మరియు తమ మాతృమూర్తి శ్రీమతి వడుగూరు సీతాలక్ష్మిగారి జ్ఞాపకార్థం శ్రీ వియెస్సెన్మూర్తి, గార్ల సౌజన్యంతో అకాడెమీ అదించడం జరిగింది.
జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, డా.వడ్లమాని ఫణీంద్రుడు శ్రీ సి.హెచ్.దుర్గాప్రసాద్, మాన్యాల సుభద్ర, శ్రీ టి. కృష్ణారావు, శ్రీ యమ్. సుబ్రమణ్యం, పి.వి. రాజ్యలక్ష్మి, మరియు జి. శ్రీరామారావుల సౌజన్యంతోనూ, సమకూర్చడం జరిగింది.
*ఇది విశాఖ మ్యూజిక్ అకాడమీ సంప్రదాయాలలో ఒక కుటుంబ సంప్రదాయం.*

*సభాకార్యక్రమం, ప్రిన్స్ రామవర్మ గాత్ర సంగీతసభ*






ఒక గంటసమయం పోటీలలో గెలుపొందిన వారి గాత్రవిద్యాప్రదర్శన అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు డా. యస్వీ రంగరాజన్, ఛీఫ్ పాట్రన్ డా.సూరపనేని విజయకుమార్, కార్యదర్శి శ్రీ యమ్మెస్ శ్రీనివాస్, కోశాధికారి శ్రీ వీరఘంట చంద్రశేఖర్, ముఖ్యఅతిథి ప్రిన్స్ రామవర్మ, పాల్గొన్నారు. ప్రార్థనగా శ్రీమతి మూలా శ్రీలత, కుమారి శ్రీవిద్య డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన 
ధవళాంబరి రాగ కృతి "శ్రీవాణి సప్తస్వరపాణి" అన్న అంశం ఆలపించడం ప్రత్యేక విశేషం. 
అధ్యక్షులు తమ స్వాగతోపన్యాసంలో, డా.మంగళంపల్లివారి రచనలు యువతరానికి ఎంతో ఆశీఃపూర్వకములు అనీ, వాటిని అధ్యయనం చేసి పాడడం, అందులో పోటీలు నిర్వహించడం ఒక చక్కని సంప్రదాయం అనీ వర్ణించారు. ఛీఫ్ పాట్రన్ డా. యస్ విజయకుమార్ గారు డా.మంగళంపల్లివారి రచనలను బాగా నేర్పిస్తున్న గురువులకు చక్కగా నేర్చి పాడుతూన్న శిష్యులకు, అభినందనలు తెలియజేశారు. తదుపరి ముఖ్యఅతిథి ప్రిన్స్ రామవర్మగారి దివ్యహస్తాల మీదుగా బహుమతుల ప్రదానం, మరియు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు అందజేయడం జరిగింది. ముఖ్యఅతిథి ప్రసంగంలో ప్రిన్స్ రామవర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారివలన యిన్నాళ్ళూ సముఖాన నిల్వలేకపోయినా, ఆన్ లైన్ మాధ్యమంలో శ్రోతలకూ, విద్యార్థులకూ దగ్గరయ్యానని తెలుపుతూ ఒక చక్కని గురువుగా డా.మంగళంపల్లివారినీ, వారి అప్రతిహతమైన గానశైలినీ, కొనియాడి వారికి మనసా శిరసా ప్రణతులందించారు.

సభానంతరం ప్రిన్స్ రామవర్మ సంగీతసభకు శ్రీ   యస్సార్ విను వాయులీనంపైన, శ్రీ బి. హరికుమార్ మృదంగంపైన సహకరించారు. జన్మరీత్యా మళయాళీయులైనా, డా. మంగళంపల్లివారి రచనల్లోని వాచకస్పష్టత భావార్థ గాంభీర్యాలకు సాటిగా దీటుగా అభినయం జతచేసి ప్రిన్స్ రామవర్మ గానంచేసిన తీరు ఆద్యంతం రసజ్ఞుల కరతాళధ్వనుల నందుకుంది. "మధ్యే మధ్యే" తన గురువుగారైన మంగళంపల్లివారి గురించి  వారి రచనలగురించి చెప్పిన విశేషాలు అమృత గుళికలు. ఖరహరప్రియ వర్ణంతో తనగానం ఆరంభించి, ముందు తానవర్ణంగా ఉన్న ఈ రచనను కొన్ని యేండ్ల తరవాత పదవర్ణంగా గురువుగారు మార్చారు అనిచెబుతూ, ప్రిన్స్ రామవర్మ "నిన్ను నెరనమ్మితి గణనాయకా" అనే ఖరహరప్రియ తానవర్ణం పాడారు. తరువాయి సంప్రదాయ రాగ స్వరూపాన్ని వివరిస్తూ డా. మంగళంపల్లివారు సృష్టించిన "గణపతి" అనే త్రిస్వర రాగంలో "త్రిభువన, త్రికాలవర్తిం, త్రిశక్తిం, సిద్ధిబుద్ధి సంతోష కలాపం" అంటూ "త్రి" అన్న శబ్దాన్ని ఎంతో అర్థవంతంగా సార్థకంగా ప్రయోగించిన వాగ్గేయకారులు బాలమురళీకృష్ణ అంటూ వేనోళ్ళ కీర్తిస్తూ గానం చేశారు. తరువాత రసికప్రియ రాగంలో "పవనతనయ పాలయమాం" గానం చేసినతీరులో "రసికప్రియ- రామవర్మ" సమానార్థకాలు అనిపించాయి. తరువాత "గానమాలించి కావవే కంచికామాక్షి" కృతిని గానం చేశారు. అటుపిమ్మట బాలమురళి దర్శించి సృజించిన "రోహిణి" రాగాలాపన శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది. "ఈ మనుజులకు నీ మహిమదెలిపే" అన్న సాహిత్యవివరం అనన్య సామాన్యంగా భాసించింది  "మరకత సింహాసన నరసింహా" (సింహేంద్రమధ్యమం), తరువాత శంకరాభరణరాగ ఆధారితమైన అత్మకథా సదృశభావ గీతాలాపన తిల్లానాలతో ప్రిన్స్ రామవర్మ కచేరీ బహు రంజకంగా సాగింది.

శ్రీ యస్సార్ విను వాయులీన సహకారం ఆద్యంతం "విను" అంటూ వీనులవిందుగా సాగింది. 
SR అంటే "శృతి రమ్యం"  అనిపించింది. SR అంటే "sensitive and resplendent" అనిపించింది. "రోహిణి" "సింహేంద్రమధ్యమం" రాగాలలో తన మనోధర్మాన్ని, సహకార "ధర్మచట్రం"లో ప్రదర్శించిన తీరు శ్రోతల ప్రశంసల నందుకుంది. 
శ్రీ బి హరికుమార్ మృదంగ సహకారం కచేరి నిండుతనానికి మరింత సహకరించింది. Mridangam sounded very soft melodious, mellifluous and melting. మృదంగ వాదన సొగసుగా కర్ణరంజకంగా సాగింది. ప్రిన్స్ రామవర్మ బృందానికి రసికశ్రోతృ మండలి "standing ovation" తో స్పందించింది.
బహుమతులు గెలుచుకున్నవారి గాత్రధర్మప్రదర్శనకు సమయం కేటాయింపు, తదుపరి పోటీవిజేతలకు బహుమతిప్రదానం, న్యాయనిర్ణేతలకు సత్కారం, అందరితో బృందఛాయాచిత్రం, యివన్నీ చాలా మంచి ప్లాన్ తో ఎప్పటిలాగే శ్రీ యమ్మెస్ శ్రీనివాస్ సారథ్యంలో చక్కగా నిర్వహించబడ్డాయి. 
డా. పేరాల బాలమురళికృష్ణ సమీక్ష వందనసమర్పణలతో సభ సుసంపన్నం.

పేరాల బాలమురళికృష్ణ

 విశాఖ మ్యూజిక్ అకాడమి విశాఖపట్నం 54వ వార్షిక సంగీతనృత్యోత్సవాలు విశాఖ మ్యూజిక్ అకాడమి స్థానిక కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో 25.11.2023 నుండి ...